నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం తండేల్. చందూ మొండేటి దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి హైలెస్సో హైలెస్సా అనే మూడో గీతాన్ని విడుదల చేశారు. దేవిశ్రీప్రసాద్ స్వరపరచిన ఈ గీతానికి శ్రీమణి సాహిత్యాన్నందించారు. శ్రేయా ఘోషల్, నకాష్ అజీజ్ ఆలపించారు. ఎంతెంత దూరాన్ని నువ్వూ నేనూ మోస్తూ ఉన్నా అసలింత అలుపే రాదు..ఎన్నెన్ని తీరాలు నీకూ నాకు మధ్యన ఉన్నా కాస్తయినా అడ్డే కాదు. నీతో ఉంటే తెలియదు సమయం..నీవు లేకుండా ఎంత అన్యాయం గడియారంలో సెకనుల ముల్లే గంటకు కదిలిందే.. నీతో ఉంటే కరిగే కాలం..నువు లేకుంటే కదలదు కాలం అని నెలలో ఉండే తేదీ కూడా డాదయ్యిందే..హైలెస్సో అంటూ నాయకానాయికల మధ్య ఉండే అనురాగాన్ని ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది.
సముద్ర నేపథ్యంలోని విజువల్స్ కట్టిపడేసేలా ఉన్నాయి. నాగచైతన్య, సాయిపల్లవి మధ్య కెమిస్ట్రీ ప్రధానాకర్షణగా నిలిచింది. మత్స్యకారుల జీవితం నేపథ్యంలో ప్రేమ, దేశభక్తి ప్రధానాంశాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్‌దత్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సమర్పణ: అల్లు అరవింద్, రచన-దర్శకత్వం: చందూ మొండేటి.