చైనాతో తైవాన్ పునరేకీకరణను ఎవరూ అడ్డుకోలేరని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రకటించారు. 2.3 కోట్ల జనాభా గల తైవాన్ లోపలి, వెలుపలి స్వాతంత్య్ర అనుకూల శక్తులకు చైనా అధ్యక్షుడు తన నూతన సంవత్సర సందేశంలో గట్టి హెచ్చరికలు జారీచేశారు. చైనా గత సంవత్సరం దాదాపు ప్రతిరోజు తన యుద్ధనౌకలను, విమానాలను తైవాన్ సమీపంలోకి పంపి సైనిక ఒత్తిడిని పెంచినట్టు ప్రకటించింది. ఈ చర్యలు తైవాన్‌లో తన సైనిక ఉనికిని సుస్థిరం చేసుకోవడానికి చైనా చేస్తున్న కుటిల ప్రయత్నంగా తైవాన్ ప్రభుత్వం ఇదివరకు ఆరోపించింది. ప్రజాస్వామిక పాలన గల తైవాన్ ద్వీపాన్ని తన సొంత భూభాగంగా చైనా పరిగణిస్తున్నది. అయితే ఈ వాదనలను తైవాన్ బలంగా తోసిపుచ్చుతున్నది. తైవాన్ ప్రజలు మాత్రమే తమ భవిష్యత్తును నిర్ణయించుకుంటారని, ఆ నిర్ణయాన్ని చైనా గౌరవించాల్సి ఉంటుందని తైవాన్ ప్రభుత్వం ప్రకటించింది.