ఉత్తర కొరియా నిర్వహిస్తున్న మిస్సైల్ పరీక్ష లతో జపాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. జపాన్‌లోని హొక్కైడో ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఉత్తర కొరియా క్షిపణిని పరీక్షించినట్లు వార్తలు రావడంతో ఉత్తర జపాన్ లో గందరగోళం ఏర్పడింది. తక్షణమే ఇండ్లను ఖాళీ చేయాలని ప్రజలను ఆదేశించారు. ఆ ప్రాంతంలో సరైన్లు మోగాయి. అయితే 30 నిమిషాల తర్వాత ఆ దేశాలను ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది.
ఉత్తర కొరియా పరీక్షించిన మిస్సైల్ హోక్కైడో దీవి వద్ద పడలేదని, అందుకే అలర్ట్‌ను వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. నార్త్ కొరియా ఈ ఏడాది ఇప్పటికే 27 మిస్సైళ్లను పరీక్షించింది. దీంతో ఆ ప్రాంతలో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఉత్తర కొరియా ఏ రకమైన ఆయుధాన్ని పరీక్షించిందో ఇంకా తెలియదు. కానీ మీడియం లేదా లాంగ్ రేంజ్ మిస్సైల్‌ను పరీక్షించినట్లు భావిస్తున్నారు.
తమ ప్రభుత్వం జాతీయ సెక్యూర్టీ కౌన్సిల్ మీటింగ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా తెలిపారు. ఉత్తర కొరియా ఈశాన్య ప్రాంతంలోని సముద్ర జలాల్లో మిస్సైల్ కూలినట్లు జపాన్ కోస్టు గార్డులు తెలిపారు. దక్షిణ కొరియా, అమెరికా దేశాలు ఆ పరీక్షను ఖండించాయి.