తన ప్రత్యర్థి కమలా హారిస్ తో మరో డిబేట్‌కు సిద్ధంగా లేనని అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తొలి డిబేట్‌లో ఓడిపోయిన వాళ్లే మళ్లీ చర్చకు సిద్ధమవుతారని కమలా హారిస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.కాగా, అధ్యక్ష రేసులోంచి జో బైడెన్ వైదొలగకముందు ట్రంప్, బైడెన్‌ల మధ్య తొలి డిబేట్ జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అనూహ్యంగా ఆయన అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నారు. దీంతో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా రేసులోకి వచ్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్ – కమలా మధ్య తొలి డిబేట్ జరిగింది. పెన్సిల్వేనియాలోని నేషనల్ కాన్‌స్టిట్యూషన్ సెంటర్ వేదికగా జరిగిన మొదటి ముఖాముఖిలో ఇద్దరూ పాల్గొన్నారు. వాడీవేడిగా సాగిన ఈ డిబేట్‌లో పరస్పర విమర్శల దాడి చేసుకున్నారు. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఈ ముఖాముఖి చర్చలో కమలా హారిస్‌దే పైచేయి అని అమెరికా మీడియా మొత్తం తేల్చింది. అయితే, అందుకు ట్రంప్ అంగీకరించట్లేదు.