ముగ్గురు పిల్లల జనాభా విధానాన్ని చైనా జాతీయ చట్టసభ లాంఛనంగా ఆమోదించింది. అధికార కమ్యూనిస్టు పార్టీ తెచ్చిన ప్రతిపాదనకు దేశ పార్లమెంటు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్‌పీసీ)లోని స్థాయి సంఘం లాంఛనంగా ఆమోద ముద్ర వేసింది. ఇందుకు అనుగుణంగా జనాభా, కుటుంబ నియంత్రణ చట్టాన్ని సవరించింది. జనాభాలో ప్రపంచ అగ్రగామి దేశమైన చైనాలో జననాల రేటు వేగంగా పడిపోతున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. సవరించిన జనాభా, కుటుంబ నియంత్రణ చట్టం ప్రకారం చైనా దంపతులు ఇకనుంచి ముగ్గురేసి పిల్లలను కనొచ్చు. పిల్లలను పెంచడం, విద్యాబుద్ధులు చెప్పించడానికి అయ్యే భారాన్ని తగ్గించేందుకు ఆర్థిక, గృహనిర్మాణ, ఉపాధి రంగాల్లో ప్రోత్సాహకాలు ఇస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడిరచింది. 2016కు ముందు దశాబ్దాల పాటు చైనాలో ఏక సంతాన విధానం ఉండేది. ఇది దేశంలో జనాభాపరమైన సంక్షోభానికి కారణమైందన్న విమర్శలు వచ్చాయి.