అమెరికా పర్యటలో ఉన్న రాహుల్ గాంధీ న్యూయార్క్‌లోని జవిట్స్ సెంటర్‌లో భారత సంతతి ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఒడిశా మూడు రైళ్ల ప్రమాద మృతులకు ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. రైలు ప్రమాదం ఎందుకు జరిగిందంటే కాంగ్రెస్ 50 ఏండ్ల క్రితం నిర్మించిందని అంటారు. పుస్తకాల నుంచి పీరియాడిక్ టేబుల్, పరిణామ సిద్దాంతం ఎందుకు తొలగించారంటే కాంగ్రెస్ 60 ఏండ్ల క్రితం పెట్టింది కాబట్టి అంటారని రాహుల్ విమర్శించారు. వారు స్పందించే తీరు గతాన్ని చూడమని చెబుతుందని, ప్రధాని, మంత్రుల మాటలు వింటే వారు భవిష్యత్ గురించి మాట్లాడంలేదని మీరు గుర్తించొచ్చని చెప్పారు. వారు గతం గురించే మాట్లాడుతారని, గతానికి సంబంధించి ఒకరిని నిందిస్తారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైలు ప్రమాదం జరిగితే బ్రిటిష్ వారివల్లే ఇది జరిగిందని తామెప్పుడూ చెప్పలేదన్నారు. ఇది నా బాధ్యత కాబట్టి నేను రాజీనామా చేస్తానని కాంగ్రెస్ మంత్రి చెప్పినట్లు తనకు గుర్తుందని తెలిపారు. ఇప్పుడు ఇదే మన దేశంలో ఉన్న సమస్య అని వెల్లడించారు. ప్రధాని మోడీ వెనక అద్దం చూస్తూ భారతదేశం అనే కారును నడుపుతున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. అద్దంలో చూసి కారు నడుపుతూ ప్రమాదం ఎందుకు జరిగిందని అడిగే పరిస్థితుల్లో ప్రధాని మోడీ, బిజెపి ఉన్నాయన్నారు. బిజెపి ఎప్పుడూ గతం గురించి మాత్రమే మాట్లాడుతుందని, భవిష్యత్తు గురించి ఆలోచించదని చెప్పారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)