అమెరికాలోని ఆస్టిన్‌లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా 10వ మినీ మహానాడును ఘనంగా నిర్వహించారు. టీడీపీ ఎన్‌ఆర్‌ఐ యూఎస్‌ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ చిత్రాల్లోని పాటలతో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో యువత, చిన్నారులు అలరించారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి చేపట్టిన కార్యక్రమాలు, అధికారంలోకి వచ్చాక తీసుకున్న నిర్ణయాలను గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయసాధనకు చేపట్టాలసిన కార్యక్రమాలను యువతకు నేతలు వివరించారు. ఈ సందర్భంగా జయరాం కోమటి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాని ఎలా దివాళా తీయించిందో చెప్పారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కనీవినీ ఎరుగని రీతిలో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.