నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా అమెరికాలోని ఎన్నారైలు ఘనంగా నివాళులు అర్పించారు. న్యూజెర్సీలోని ఎడిసన్‌లో యూబ్లడ్ యాప్ అధినేత డాక్టర్ జై యలమంచిలి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి ఆన్‌లైన్ వేదికగా పాల్గొని ప్రసంగించారు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అసాధారణ రీతిలో ఎదిగి ప్రజలకు సేవ చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీ యంగా నిలుస్తాయన్నారు.
ప్రముఖ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ భార్య అనారోగ్యం కారణంగా అమెరికా వస్తే తాను చికిత్స చేశానని చెప్పారు. మేమైతే అమెరికా వచ్చి చికిత్స చేయించుకున్నాం. మరి సామాన్యుల పరిస్థితి ఏంటి అని అప్పుడే ఎన్టీఆర్ ఆలోచించి తన భార్య పేరిట హైదరాబాద్‌లో బసవతారకం హాస్పిటల్ నిర్మించారని ఈ సందర్భంగా తెలిపారు. ఎన్టీఆర్ మహోన్న త వ్యక్తి అని అన్నారు.
కార్యక్రమ నిర్వాహకులు జై యలమంచిలి మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు వారి గుండెలో శాశ్వతంగా నిలిచి పోయారని అన్నారు. సినిమాలు ఉన్నంతకాలం, రాజకీయాలు ఉన్నంతకాలం, తారక రాముడి నామం చిర స్థాయిగా నిలిచే ఉంటుందన్నారు. ఆన్‌లైన్ వేదికగా మన్నవ మోహన్ కృష్ణ, మన్నవ సుబ్బారావు, పాతూరి నాగభూషణం పాల్గొని ప్రసంగించారు. ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. యుగపురుషులు అరుదుగా జన్మిస్తా రని, అందులో ఎన్టీఆర్ ఒకరని అతిథులు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు గౌరవాన్ని నిలిపిన వ్యక్తిగా ఎన్టీఆర్‌ను కీర్తించారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగు ఎన్నారైలు పాల్గొని ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. రాజేందర్ డిచ్‌పల్లి, ప్రదీప్ సాముల, నాగేశ్వర్ చెరుకుపల్లి, టీపీ రావు, శ్రీనివాస్ నాదెళ్ల తదితరులు పాల్గొన్నారు.