Skip to main content

Namaste NRI

అఖిల్ లెనిన్ కోసం.. రంగంలోకి ఎన్టీఆర్

లెనిన్‌ చిత్రంతో మీ అందరి ఇంటివాణ్నైపోతానని తిరుపతిలో జరిగిన సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో చిత్ర కథానాయకుడు అక్కినేని అఖిల్‌ ధీమా వ్యక్తం చేసిన విషయం విదితమే. ఈ సినిమా చూశాక ప్రతీ ఒక్కరూ అఖిల్‌ను ప్రేమిస్తారని, అందరూ ఆశ్చర్యపోయే విధంగా అతని పర్‌ఫార్మెన్స్‌ ఉంటుందని అగ్ర హీరో నాగార్జున సైతం నమ్మకం వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అఖిల్‌ కథానాయకుడిగా మురళీకిషోర్‌ అబ్బూరు దర్శకత్వంలో నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలకానుంది. తాజాగా ఈ చిత్రం తాలూకు సర్‌ఫ్రైజ్‌ అప్‌డేట్‌ వెలువడింది. ఈ సినిమాకు అగ్ర హీరో ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారని మేకర్స్‌ తెలిపారు.

సినిమా కథా నేపథ్యాన్ని, కథ జరిగే శ్రీరామపురం గ్రామ వివరాలను ఎన్టీఆర్‌ తన వాయిస్‌ ఓవర్‌తో ప్రేక్షకులకు పరిచయం చేస్తారని చిత్రబృందం వెల్లడించింది. ఎన్టీఆర్‌కు నాగార్జునతో, అక్కినేని కుటుంబంతో గాఢమైన అనుబంధం ఉందని, అందుకే అఖిల్‌ కోసం ఎన్టీఆర్‌ ప్రత్యేకంగా వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారని చెబుతున్నారు. ఈ సందర్భంగా డబ్బింగ్‌ థియేటర్‌లో ఎన్టీఆర్‌, అఖిల్‌ కలిసి ఉన్న ఫొటోలను మేకర్స్‌ విడుదల చేశారు. రాయలసీమ గ్రామీణ నేపథ్య కథతో సామాజికాంశాలను చర్చిస్తూ ప్రేమకథగా లెనిన్‌ చిత్రాన్ని తెరకెక్కించారు. భాగ్యశ్రీ బోర్సే, సునీల్‌, బ్రహ్మాజీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, సమర్పణ: అన్నపూర్ణ స్టూడియోస్‌, రచన-దర్శకత్వం: మురళీకిషోర్‌ అబ్బూరు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events