నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా ఖతర్ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆయనకు ఘన నివాళులు అర్పించాయి. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించాయి. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమం, అద్భుతమైన శ్లోకాలతో ముగిసింది. ఎన్టీఆర్ చేసిన ఎన్నో కార్య క్రమాలను నేటి తరానికి టీడీపీ సభ్యులు వివరించే ప్రయత్నం చేశారు. ఖతర్ టీడీపీ అధ్యక్షులు గొట్టిపాటి రమణయ్య మాట్లాడుతూ ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉంటాయ ని చెప్పుకొచ్చారు. టీడీపీని తిరిగి అధికారంలోకి తేవడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు.
ప్రధాన కార్యదర్శి పొనుగుమాటి రవి మాట్లాడుతూ మద్రాసీయులుగా పిలవబడే తెలుగువారి కీర్తి ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత ఆయన సొంతమని, అటు చలనచిత్ర రంగంలోకానీ, ఇటు రాజకీయ రంగంలోకానీ తనకి తానే సాటి , మరొకరు లేరు ఆయనకు పోటీ అని కొనియాడారు. ఎన్టీఆర్ నినాదం కూడు, గూడు, గుడ్డ దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పుకొచ్చారు.ఈ కార్యక్రమంలో జీసీసీ కౌన్సిల్ మెంబర్ మల్లిరెడ్డి సత్యనారాయణ, యలమంచిలి శాంతయ్య, కోశాధికారి విక్రమ్ సుఖవావి, డాక్టర్ రవీంద్రనాథ్ చిన్నూరు. యాసిన్, జుబేర్, బోండ్ల పాటి విజయ్ కుమార్, సాయి మోహన్, వేరేపల్లి అనిల్, అవినాశ్ మద్దిరాల తదితరులు పాల్గొన్నారు.