అమెరికా అధ్యక్ష పదవికి వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పాత ప్రత్యర్థులైన జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఎన్నికల బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇటీవల జరిగిన డెమొక్రాటిక్ పార్టీ నేతల సమావేశంలో మరోసారి అధ్యక్ష పదవి బరిలో నిలవాలన్న మనసులోని మాటను జో బైడెన్ వ్యక్తం చేశారు. దుందుడుకు మనస్తత్వానికి మారుపేరుగా నిలిచిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మరోసారి పోటీ చేస్తానంటున్నారు. అధ్యక్ష పదవి రేసులో తాను ఉంటానని ట్రంప్ మహాశయుడు ఇటీవల కుండబద్దలు కొట్టారు. అగ్రరాజ్యానికి పూర్వవైభవం రావాలంటే తన నాయకత్వమే శరణ్యమన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ విధానాల ఫలితంగా ప్రపంచ రాజకీయాల్లో అమెరికా ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని డొనాల్డ్ ట్రంప్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటే రిపబ్లికన్ పార్టీ నుంచి ఈసారి అధ్యక్ష పదవి అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న వారిలో చాలా మంది సీనియర్ నేతలున్నారు. వీరిలో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్, మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ కూడా ఉన్నారు. అధ్యక్ష పదవి అభ్యర్థిత్వం లభించాలంటే ముందుగా వీరితో ప్రైమరీ ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ పోటీపడి నెగ్గాల్సి ఉంటుంది. ఆ తరువాత ప్రతినిధుల సభలో ట్రంప్ మెజారిటీ సాధించాల్సి ఉంటుంది. డోనాల్డ్ ట్రంప్‌కు అభ్యర్థిత్వం ఖరారు కావడం సంగతి ఎలాగున్నా ఇప్పటికైతే అధ్యక్ష పదవి ఎన్నికకు ఆయన ఉత్సాహంగా రెడీ అవుతున్నారు. ఏమైనా రహస్య పత్రాల ఎపిసోడ్‌ను డెమొక్రాటిక్ పార్టీ పెద్దగా పట్టించుకోకపోయినా, పార్లమెంటు భవనంపై దాడి సంఘటనను రిపబ్లికన్ పార్టీ క్షమించేసినా పాత ప్రత్యర్థులు జో బైడెన్, డోనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో మరోసారి తలపడే అవకాశాలు లేకపోలేదు.