ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షల విద్యార్థులు తో జరగనున్న అరుదైన కార్యక్రమం. తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, వందేవిశ్వమాతరమ్ చైర్మన్ జయశేఖర్ తాళ్ళూరి వెల్లడి. ఉత్తర అమెరికా తెలుగు సంఘం TANA ఆధ్వర్యంలో డిసెంబర్ 18 న పది లక్షల మంది విద్యార్థులతో అమ్మ నాన్న గురువు శతక పద్యార్చన జరుగుతుంది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం TANA మరియు 100 దేశాల లోని తెలుగు సంఘాల ఆధ్వర్యంలో శత శతక కవి చిగురుమళ్ళ శ్రీనివాస్ “వందేవిశ్వమాతరమ్” పేరుతో 100 దేశాలలో శాంతి, సద్భావనా యాత్ర కు శ్రీకారం చుట్టారు.
ప్రపంచ సాహిత్య చరిత్రలో అపూర్వమైన ఘట్టంగా చెప్పదగిన ఈ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక చైతన్య యాత్ర లో భాగంగా అమ్మ నాన్న గురువు శతక పద్యార్చన నిర్వహింపబడుతుంది అని తానా అధ్యక్షులు శ్రీ నిరంజన్ శృంగవరపు , తానా పూర్వ అధ్యక్షులు, వందే విశ్వమాతరమ్ చైర్మన్ శ్రీ జయశేఖర్ తాళ్లూరి తెలిపారు.
చిగురుమళ్ళ శ్రీనివాస్ రచించిన అమ్మ శతకం, నాన్న శతకం, గురువు శతకాలలోని పద్యాలు పిల్లలతో కంఠస్థం చేయించి, డిసెంబర్ 18న ఎవరి విద్యా సంస్థల్లో వారు ఉదయం 9 గంటలకు సామూహిక పద్య గానం చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాల ఆధ్వర్యంలో తెలుగు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అని వారు వెల్లడించారు.