కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇంటి వద్ద సిక్కులు నిరసన వ్యక్తం చేశారు. సిక్కు సమాజ స్థితిగతులపై అమెరికాలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బారికేడ్లు దాటేందుకు ప్రయత్నించిన సిక్కులను పోలీసులు నియంత్రించారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ వాషింగ్టన్ డీసీలోని వర్జీనియా సబర్బ్ హెర్న్‌డాన్‌లో భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్‌లో మత స్వేచ్ఛ గురించి ఆయన మాట్లాడారు. భారతదేశంలో ఒక సిక్కు తలపాగా ధరించడానికి లేదా కడా ధరించడానికి అనుమతిస్తారా?, సిక్కుగా గురుద్వారాకు వెళ్లగలరా? అన్న దానిపై పోరాటం. ఇది (ఈ పోరాటం) ఒక్క సిక్కుల కోసమే కాదు అన్ని మతాల కోసం అని అన్నారు.
రాహుల్ గాంధీ అమెరికాలో చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ అనుబంధ సిక్కు సంఘాలు నిరసన చేపట్టాయి. ఢిల్లీలోని జనపథ్ రోడ్డులో ఉన్న రాహుల్ గాంధీ ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో సిక్కులు తరలివచ్చారు. విదేశాలకు వెళ్లిన ఆయన సిక్కుల పరువు తీయడం ఎందుకని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ సిగ్గుపడాలంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బారికేడ్లను దాటి ముందుకు వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.