భారతీయ చేనేత, నేత కార్మికులను ప్రోత్సహించడానికి, వారికి మద్దతు కోసం ఆగస్టు ఏడో తేదీన జాతీయ చేనేత దినోత్సవం నేపథ్యంలో బ్రిటన్ రాజధాని లండన్‌లో శారీ వాకథాన్-2023 నిర్వహించారు. ఐఐడబ్ల్యూ సహకారంతో బ్రిటిష్ ఉమెన్ ఇన్ శారీస్ సంస్థ వ్యవస్థాపకురాలు డాక్టర్ దీప్తి జైన్, ఈ వేడుకలు నిర్వహించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమానికి బ్రిటన్‌లోని వివిధ రాష్ట్రాల నుంచి 500 మందికి పైగా భారతీయ మహిళలు హాజరయ్యారు. శారీ వాకథాన్‌లో భారత్‌లో అందమైన ప్రాంతీయ చేనేత చీరలు ధరించారు. తెలంగాణలోని గద్వాల్, పోచంపల్లి, పోచంపల్లి ఇక్కత్, నారాయణపేట, గొల్లభామ వంటి చేనేత చీరలతో 40 మందికి పైగా తెలంగాణ మహిళల బృందం శారీ వాకథాన్‌లో పాల్గొన్నది. మన చేనేత వస్త్రాలపై అవగాహన కల్పించడంతోపాటు మన రాష్ట్ర, దేశానికి గల గొప్ప సాంస్కృతిక వారసత్వ ప్రదర్శన కోసం శారీ వాకథాన్ నిర్వహించారు.
అంతర్జాతీయంగా నిర్వహిస్తున్న ప్రమోషన్ల కార్యక్రమాల్లో విస్త్రుతంగా పాల్గొని చేనేత కార్మికుల జీవనోపాధికి తోడ్పాటునందించాలని ఆకాంక్షిస్తున్నామని బ్రిటిష్ ఇన్ ఉమెన్ శారీస్ తెలంగాణ కోఆర్డినేటర్లు ప్రతిమ, జ్యోతి, అనూష, సాధన, సింధు, గోద పేర్కొన్నారు. శారీ వాకథాన్ ప్రాంతీయ చేనేత, నేత గొప్ప సాంస్కృతిక వారసత్వం, అందాల ప్రదర్శనకు నిర్వహించిన శారీ వాకథాన్-2023కి సెంట్రల్ లండన్ లోని ట్రాఫాల్గర్ స్క్వేర్ నుంచి ప్రారంభమై 10-డౌనింగ్ స్ట్రీట్ మీదుగా పార్లమెంట్ స్క్వేర్ వద్ద గల మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ముగిసింది. వాకథాన్-2023లో పాల్గొన్న మహిళలు జాతీయ గీతాలాపనతో, ప్రాంతీయ భాషా గేయాల ఆలాపనతో సాగారు.