అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ క్యాంపస్‌లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఓ సాయుధుడు యూనివర్శిటీ క్యాంపస్‌లోకి చోరబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. రెండు చోట్ల కాల్పులకు పాల్పడినట్లు యూనివర్శిటీ పోలీసులు వెల్లడించారు. యూఎస్ కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 8.30 గంటల సమయంలో తమకు ఈ ఘటనపై సమాచారం అందినట్టు పోలీస్ అధికారి క్రిస్ రోజ్‌మన్ తెలిపారు. క్యాంపస్‌లోని రెండు భవనాల వద్ద కాల్పులు జరిపినట్లు యూనివర్శిటీ సిబ్బంది వెళ్లడించారు. ఇక కాల్పుల శబ్ధం వినిపించడంతో భయాందోళనకు గురైన విద్యార్థులు, సిబ్బంది వెంటనే గదుల్లోకి పారిపోయారు. కాల్పుల అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా నిందితుడి ఫొటోలను విడుదల చేశారు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని రోజ్‌మన్ చెప్పారు.














