ఈ నెల 25న హైటెక్స్ వేదికగా జరగబోయే టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరికీ ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ 25న ఉదయం 10 గంటలకు ప్లీనరీ ప్రారంభం అవుతుందని తెలిపారు. 6 వేల పైచిలుకు ప్లీనరీ ప్రతినిధులకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్లీనరీ ప్రాంగణంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం 35 కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. పోలీసులకు ప్రజాప్రతినిధులు సహకరించాలి. నగర ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా 50 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశామన్నారు. 8 వేల వాహనాలకు సరిపోయే విధంగా పార్కింగ్ సౌక్యం కల్పించామన్నారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఉదయం 11 నుంచి ఒంటి గంట వరకు మొదటి సెషన్ ఉంటుంది. ఈ సెషన్‌లో పార్టీ అధ్యక్ష ఎంపిక, కొన్ని తీర్మానాలు ఉంటాయి. రెండో సెషన్ 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో తీర్మానాలతో పాటు ఇతర కార్యక్రమాలు ఉంటాయి. మొత్తం 7 తీర్మానాలను ప్రవేశపెడుతున్నామని తెలిపారు.














