అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లాలనుకునే వారి సంఖ్య ఏటా పెరుగుతున్నది. అమెరికా జారీచేసే ప్రతి నాలుగు వీసాల్లో ఒక వీసా మన దేశానిదే ఉంటున్నది. ఈ ఏడాది జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో రికార్డు స్థాయిలో 90 వేలకు పైగా వీసాలను జారీచేసింది. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం (ఎంబసీ) వెల్లడించింది. అమెరికా చదువుల క్రేజ్ ఎంత మాత్రం తగ్గడం లేదు. డిమాండ్‌కు తగినట్లుగా అమెరికా సైతం వీసాలను జారీచేస్తున్నది. గత ఏడాది మొత్తంగా 1.25 లక్షల విద్యార్థి వీసాలను అమెరికా జారీచేసింది. ఏడాది వేసవిలో 82 వేల విద్యార్థి వీసాలను అందజేసింది. మరే దేశానికి ఈ స్థాయిలో వీసాలు ఇవ్వలేదని, ఈ ఏడాది విద్యార్థి వీసాలను మరింత ఎక్కువగా జారీచేసే అవకాశాలున్నాయని ఇటీవలే ఎంబసీ ప్రకటించింది. ఈ క్రమంలోనే రికార్డు స్థాయిలో మూడు మాసాల్లోనే 90 వేలకు పైగా వీసాలను జారీచేసింది.