తమ దేశంలోని ఉద్యోగులకు యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై వారు వారానికి నాలుగున్నర రోజులు పనిచేస్తే చాలని ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న ఐదు రోజుల పనిదినాలను కుదిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా వారాంతాన్ని కూడా మునుపటి శుక్ర, శనివారాల నుంచి శని, ఆదివారాలకు మార్చింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం నుంచి వీకెండ్ ప్రారంభం అవుతుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ సంస్థలు, విభాగాలన్నీ ఈ పద్ధతిని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రపంచంలో నాలుగున్నర రోజుల పని విధానాన్ని పాటిస్తున్న తొలి దేశం తమదేనని అక్కడి అధికారులు వ్యాఖ్యానించారు. ప్రజల వృత్తిగత, వ్యక్తిగత జీవితాల మధ్య సమతౌల్యం సాధించడంతో పాటూ ప్రపంచ మార్కెట్ల్లో పాటిస్తున్న విధానానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం ఓ ప్రకనటలో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే యూఏఈ కూడా ఇతర దేశాలను అనుసరిస్తూ కొత్త పద్దతిని అవలంబించేందుకు నిర్ణయించింది. ఇటువంటి నిర్ణయం తీసుకున్న తొలి గల్ఫ్ దేశంగా యూఏఈ చరిత్ర సృష్టించింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/modi-300x160.jpg)