
భారత్ ఆయుధాల కోసం రష్యాపై ఆధారపడడాన్ని మానుకోవాలని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ సూచించారు. అప్పుడే భారత్, అమెరికా సంబంధాలు బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయంగా అధునాతన అమెరికన్ రక్షణ వ్యవస్థలను అందించడానికి తమ దేశం సిద్ధంగా ఉందని అన్నారు. యూఎస్ డాలరును భర్తీ చేయడానికి కొత్త కరెన్సీ కోసం బ్రిక్స్ ప్రయత్నిస్తే ఇరు దేశాల సంబంధాలు దెబ్బతింటాయని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు న్యాయంగా ఉండాలని తాము కోరుకుంటున్నట్టు వెల్లడించారు. అలాగే తమతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి అమెరికా దిగుమతులపై సుంకాలు తగ్గించాలని భారత్‌ను కోరారు.
