పాకిస్థాన్ కష్టాల్లో కూరుకుపోతున్నది. ఆ దేశాన్ని ఆర్థిక కష్టాలు ముంచెత్తగా ఇప్పుడు ఆహార సంక్షోభం కూడా తోడైంది. ఫలితంగా నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. పాక్ ఎగుమతులు తగ్గిపోయి దిగుమతులు పెరిగిపోయాయి. విదేశీ మారక నిల్వలు అడుగంటాయి. డాలర్‌తో పాక్ రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోతున్నది. పాకిస్థాన్ ఆర్థిక స్థితి ఏనాడూ మెరుగ్గా ఏమీ లేదు. కానీ, గత ఏడాదిగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారింది. 2022లోనే డాలర్‌తో పోల్చితే పాక్ రూపాయి విలువ ఏకంగా 30 శాతం పడిపోయింది. మరోవైపు ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ద్రవ్యోల్బణం 23 శాతం వరకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి.
మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే పుట్టిన ప్రతి చోట అప్పు తెచ్చి వడ్డీలు కడుతున్నది. కొత్త అప్పుల కోసం ఆ దేశం చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదు. ఆర్థిక సమస్యలతో బ్యాంకులు సరుకు దిగుమతులకు ఇవ్వాల్సిన లెటర్ ఆఫ్ క్రెడిట్స్ ఇవ్వటం లేదు. ఫలితంగా నిత్యావసరాల దిగుమతికి ఆటంకం ఏర్పడుతున్నది. ఇవన్నీ చూస్తుంటే పాకిస్థాన్ కూడా శ్రీలంక బాటలో దివాళా దిశగా పయనిస్తున్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు.