ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో కొండగట్టుకు వచ్చిన పవన్ కల్యాణ్‌కు ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి కొండగట్టుకు వచ్చిన పవన్ కల్యాణ్‌ను చేసేందుకు స్థానికులు భారీగా ఆలయానికి తరలివచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసు లు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి రోడ్డుమార్గంలో ఆయన కొండగట్టు కు బయల్దేరారు. ఈ సందర్భంగా ఆయనకు దారి పొడవునా అభిమానులు ఘనస్వాగతం పలుకుతున్నారు.


ముందుగా హైదరాబాద్ శివారులోని తుర్కపల్లిలో పవన్ కల్యాణ్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చారు. తుర్కపల్లి నుంచి బయల్దేరిన తర్వాత సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి వద్ద కూడా జనసేన అధినేతకు ఘన స్వాగతం లభించింది. అక్కడ పవన్ కల్యాణ్‌ను గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా అభిమానులు అందించిన వీరఖడ్గంతో ఆయన ఫొటోలకు పోజులిచ్చారు. అనంతరం అభిమానులకు అభివాదం చేసుకుంటూ కొండగట్టుకు బయల్దేరి వచ్చారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించడంతో పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను చేపట్టారు. 11 రోజుల పాటు నిష్టతో ఈ దీక్షను పాటించనున్నారు. ఈ క్రమంలోనే తమ ఇలవేల్పు అయిన కొండగట్టు ఆంజనేయ స్వామిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.