వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా నటిస్తున్న చిత్రం పేక మేడలు. నీలగిరి మామిళ్ల దర్శకుడు. రాకేష్ వర్రే నిర్మాత. ఈ చిత్రం టీజర్‌ను కథానాయకుడు విశ్వక్‌సేన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా విశ్వక్‌సేన్ మాట్లాడుతూ రాకేష్ యాక్టర్‌గా నటిస్తూనే నిర్మాతగా మారడం ఆనందంగా వుంది. ఈ చిత్రం టీజర్ బాగుంది. తప్పకుండా చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. కథ చెబుతానంటే నేను టైమ్ ఇవ్వలేదు. వినలేదని ఇటీవల నాపై కొన్ని మీమ్స్ వచ్చాయి. గంట సేపు ఓ మనిషిని కూర్చోబెట్టి తిరస్కరించడం ఇష్టం లేక నా నోటి నుంచి వచ్చిన జవాబు అది. చిన్న సినిమాగా మొదలైన ఆ చిత్రం పెద్ద హిట్ అయితే ఆనందించాను. ఆ సినిమా నేను చేయాలి కానీ కుదరలేదు. మన సినిమా బావుంటే తల ఎత్తుకునేలా ఉండాలి. మన సినిమా బావుందని ఎవరినో కించపరచవొద్దు. అదొకటి నాకు బాధగా అనిపించింది అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ హైదరాబాద్‌లోని ఓ బస్తీలో సాగే కథ ఇది. ఈ సినిమా కోసం వర్క్‌షాప్ చేశాం. పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం అందరిని ఎంటర్‌టైన్ చేస్తుంది అన్నారు. వినోద్ మాట్లాడుతూ పేక మేడలు చిత్రంలో నేను చేసిన పాత్ర ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. సెకెండ్ లాక్‌డౌన్‌లో నాకు వచ్చిన ఆఫర్ ఇది. సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఈ మెసేజ్ చూసి ఫేక్ అనుకున్నా. బట్ ప్రయత్నం చేశా. సినిమాలో భాగం అయ్యా. ఈ సిననిమా జర్నీ బ్యూటిఫుల్‌గా సాగింది. తెలుగు సినిమాలో నాన్ తెలుగు హీరోని తీసుకోవడం అంటే ఎంతో నమ్మకం ఉండాలి అని అన్నారు. హీరోయిన్ అనుష సినిమాలో అవకాశం పట్ల ఆనందం వ్యక్తం చేసి సినిమా సక్సెస్ కావాలని అభిలాషించారు.