ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన కొనసాగుతోంది. మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లిన ప్రధాని క్వాడ్ దేశాల సదస్సులో పాల్గొన్నారు. ఆ తర్వాత న్యూయార్క్‌లో జరిగిన ప్రవాస భారతీయులతో ప్రత్యేక కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. తాజాగా టెక్ కంపెనీల సీఈవోలతో ప్రధాని రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్, న్యూయార్క్‌లోని ఓ హోటల్‌లో ఈ సమావేశాన్ని నిర్వహించింది.
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, ఎన్విడియా సీఈవో జెన్‌సెన్ హాంగ్ సహా 15 టాప్ టెక్ సీఈవోలు ఈ రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. సీఈవోలతో ఫలప్రదమైన చర్చలు జరిగాయని, టెక్నాలజీ, ఇన్నోవేషన్ తదితర అంశాల గురించి చర్చించినట్లు మోదీ తెలిపారు. సాంకేతికత, ఆవిష్కరణలు సహా పలు అంశాలపై చర్చలు జరిపామన్నారు. ఆయా రంగాల్లో భారత్ సాధించిన ప్రగతి గురించి మాట్లాడినట్లు చెప్పారు. మేడ్ బై ఇండియా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు వెల్లడించారు.