క్యాథలిక్ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 88 ఏండ్లు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పోప్ ఫ్రాన్సిస్ , వాటికన్ సిటీలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని వాటికన్ సిటీ అధికారికంగా ప్రకటించింది. పోప్ నిన్న ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్నట్లు తెలిపింది.

పోప్ ఫ్రాన్సిస్ గత కొన్నేళ్లుగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో తీవ్రమైన శ్వాసకోస సమస్యతో ఆయన రోమ్‌లోని ఆసుపత్రిలో చేరారు. దాదాపు రెండు నెలలు అక్కడే చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో తుది శ్వాస విడిచినట్లు వాటికన్ అధికారులు ప్రకటించారు. పోప్ ఫ్రాన్సిస్ 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో జన్మించారు. ఆయన అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. 1969లో ఆయన ప్రీస్ట్‌గా బాధ్యతలు చేపట్టారు. 1998లో ఆర్చ్‌బిషప్‌గా, 2001లో కార్డినల్‌గా ఎన్నికయ్యారు. పోప్ బెనడిక్ట్-16 ఆకస్మికంగా రాజీనామా చేయడంతో మార్చి 13, 2013లో ఫ్రాన్సిస్ 266వ పోప్‌గా ఎన్నికయ్యారు. అమెరికా ఖండం నుంచి పోప్‌గా నియమితులైన తొలి వ్యక్తిగా నిలిచారు.

పోప్ భౌతిక కాయానికి క్యాథలిక్ సంప్రదాయంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ తంతు తొమ్మిది రోజులపాటు కొనసాగనుంది. తొలుత ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం సెయింట్ పీటర్ బెసిలికాలో ఉంచనున్నారు. తొలి రెండు-మూడు రోజుల్లోనే వివిధ దేశాలకు చెందిన మత పెద్దలు, అధికారులు, కార్డినల్స్, దేశాధినేతలు పోప్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తారు. మూడు శవపేటికల్లో పోప్ భౌతిక కాయాన్ని ఉంచి ఖననం చేస్తారు.