ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్దవటం మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన శివయ్య నాయుడు రెండు సంవత్సరాల క్రితం ఉపాధి కోసం కువైత్ వెళ్లారు. అక్కడి ఒఫ్రా ప్రాంతంలోని ఓ వ్యవసాయ క్షేత్రం సేద్యం పనికి కుదిరాడు. అయితే, స్పాన్సర్ జీతం సరిగా ఇవ్వలేదు. పైగా 8 గంటలు డ్యూటీ ఉంటే 10-12 గంటలు పని చేయించాడు. అలా ఆరు నెలలు ఆ యజమాని వద్ద పని చేశాడు. చివరకు 18 నెలల కింద అక్కడి నుండి పారిపోయి బయట భవన నిర్మాణ కూలిగా మారాడు. ఈ క్రమంలో శివయ్య అనారోగ్యం బారిన పడడంతో ఆరోగ్యం క్షిణించింది. దాంతో గత కొన్ని నెలలుగా స్వదేశానికి రావాలని శతవిధాలుగా ప్రయత్నించినా సాధ్యంకాలేదు. అతని దీనస్థితిని కుటుంబ సభ్యులు ఈశ్వర్ నాయుడు, వైకాపా గల్ఫ్ కో కన్వీనర్ గోవిందు నాగరాజు, గల్ఫ్ ప్రతినిధి షేక్ ఫయాజ్‌కి తెలియజేశారు. వారు గల్ఫ్, కువైత్ కన్వీనర్లు ఇలియాస్ బి.హెచ్, ముమ్మడి బాలిరెడ్డి దృష్టికి తీసుకు వెళ్లారు. దాంతో వెంటనే స్పందించి ఏపీఎన్ఆర్‌టీఎస్ రీజనల్ కోఆర్డినేటర్ నాయని మహేశ్వర్ రెడ్డికి చెప్పారు. ఆయన ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి స్పాన్సర్ వద్ద నుంచి శివయ్యకు పాస్‌పోర్ట్ ఇప్పించారు. ఆ తర్వాత ఇండియా పంపించడం జరిగిందని ఇలియాస్, బాలిరెడ్డి తెలిపారు.