ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2023లో ఫిలడెల్ఫియాలో జూలై నెలలో నిర్వహించే 23వ తానా మహాసభలను పురస్కరించుకుని ఇండియాలో మొట్టమొదటిసారిగా సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్‌లోని దస్‌పల్లా హోటల్‌లో జరిగిన ఈ సమావేశానికి మంచి స్పందన వచ్చింది. తానా నాయకులతోపాటు దాతలు, సినీ నటీనటులు, వ్యాపార, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తానా బోర్డ్ డైరెక్టర్ జాని నిమ్మలపూడి ఆధ్వర్యంలో జరిగిన ఈ సన్నాహక సమావేశానికి వ్యాపారవేత్తలు రామకృష్ణ బొబ్బ, సుధాకర్ కొర్రపాటి డోనర్లుగా వ్యవహరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సినీ నటుడు మురళీ మోహన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా తానా మహాసభల లోగోను, ప్రోమోను మురళీ మోహన్ ఆవిష్కరించి మాట్లాడారు. తనకు తానా అంటే చాలా ఇష్టం అని ఇప్పటివరకు 20 సార్లు వారి మహాసభలకు హాజరయ్యానని పేర్కొన్నారు. తానా ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను మురళీమోహన్ ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు మాట్లాడుతూ, ఫిలడెల్పియాలో జూలై నెలలో నిర్వహిస్తున్న తానా మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, ఈ మహాసభలకు అందరూ రావాల్సిందిగా ఆహ్వానించారు. వ్యాపార ప్రముఖులతోపాటు, రాజకీయ, సినీతారలు, సాహితీవేత్తలు ఇతరులు అందరూ ఈ మహాసభల విజయవంతానికి సహకరించి తానా ఆతిధ్యాన్ని స్వీకరించాలని ఆయన కోరారు. దాతలు ఇస్తున్న సహకారం మరువలేనిదంటూ తానాకు సహకరిస్తున్న దాతలను ఆయన ఈ కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు. తానా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తానా కార్యక్రమాలను మరింతగా విస్తరించడంతోపాటు తానా బలోపేతానికి కృషి చేసినట్లు ఆయన చెప్పారు.
తానా మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి మహాసభలకు సంబంధించిన విశేషాలను వివరించి అందరూ ఈ మహాసభలకు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తానా బోర్డ్ డైరెక్టర్ జాని నిమ్మలపూడి సేకరించిన కోటి రూపాయలను బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమం విజయవంతంకావడంలో ప్రతాపరెడ్డి కూడా కీలకపాత్ర పోషించారని జాని నిమ్మలపూడి తెలిపారు.
తానా నాయకులు లక్ష్మీ దేవినేని, శశికాంత్ వల్లేపల్లి, పురుషోత్తం చౌదరి గూడె, సురేష్ పుట్టగుంట, రవి మందలపు, సునీల్ పంత్ర, శ్రీనివాస్ ఓరుగంటి, ఉమ కటికి, రాజా కసుకుర్తి, సురేష్ కాకర్ల, హితేష్ వడ్లమూడి, శశాంక్ యార్లగడ్డ, శ్రీనివాస్ కూకట్ల, టాగూర్ మలినేని, రఘు ఎద్దులపల్లి, సుమంత్ పుసులూరి తదితరులతోపాటు సినీ రంగ ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఈ మహాసభల సన్నాహక సమావేశానికి హాజరయ్యారు.