ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా రూ.100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము విడుదల చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ప్రెసిడెంట్ ముర్ము మాట్లాడుతూ భారతీయ సినిమా చరిత్రలో ఎన్టీర్ ఎంతో ప్రత్యేకమన్నారు. కృష్ణుడు, రాముడి వంటి పాత్రల్లో ఆయన నటన అద్భుతమని, ప్రజల్లో చెరగని ముద్ర వేశారని చెప్పారు. రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ తన ప్రత్యేకత చాటుకున్నారని తెలిపారు. సామాజిక న్యాయం కోసం ఎంతో కృషి చేశారని వెల్లడించారు. ఎన్టీఆర్ విలక్షణ వ్యక్తిత్వాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు , బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఏపీ బీజేపీ చీఫ్, ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి, దగ్గుపాటి వెంకటేశ్వర్లు, నటుడు బాలకృష్ణ, నారా బ్రాహ్మణి , ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు. టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, గల్లా జయదేవ్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, ఎంపీ రఘురామ కృష్ణరాజు, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, మాజీ ఎంపీ సుజనా చౌదరి, కంభంపాటి రామ్మోహన్ రావు, బాలకృష్ణ, అశ్విని దత్, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పాల్గొన్నారు.