అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే గోల్డ్ కార్డు ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న పెట్టుబడి వీసా ఈబీ-5 స్థానంలో గోల్డ్ కార్డు తీసుకురానున్నట్లు వెల్లడించారు. 5 మిలియన్ డాలర్లు (సుమారు 44 కోట్లు) చెల్లించగలిగే వారికి నేరుగా అమెరికా పౌరసత్వాన్ని ఇవ్వనున్నారు. ట్రంప్ ప్రకటించిన ఈ గోల్డ్ కార్డుకు అమెరికాలో భారీ గిరాకీ ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా గోల్డ్ కార్డుకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను అధ్యక్షుడు విడుదల చేశారు. ట్రంప్ చిత్రంతో ఉన్న ఈ గోల్డ్ కార్డును ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేకరులతో మాట్లాడే సమయంలో చూపించారు. ఈ గోల్డ్ కార్డును 5 మిలియన్ డాలర్లు చెల్లించి ఎవరైనా సొంతం చేసుకోవచ్చని తెలిపారు. అంతేకాదు ఈ గోల్డ్ కార్డును తానే మొదట కొనుగోలు చేసినట్లు ఈ సందర్భంగా అధ్యక్షుడు ప్రకటించారు. రెండో కొనుగోలుదారు ఎవరో తనకు తెలియదని చెప్పారు. ఈ గోల్డ్ కార్డు రెండు వారాల్లో అమ్ముడయిపోతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
