
ఇజ్రాయిల్ , ఇరాన్ మధ్య 12 రోజుల యుద్ధానికి బ్రేక్ పడిన విషయం తెలిసిందే. కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటన చేయడంతో, రెండు దేశాలు అంగీకారం తెలిపాయి. ఇక ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా బీ2 బాంబర్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడిలో అణు కేంద్రాలు ధ్వంసం కాలేదని అమెరికా ఇంటెలిజెన్స్ పేర్కొన్నది. దీనికి సంబంధించిన రిపోర్టు ఒకటి రిలీజైంది. ఫోర్డో, నటాంజ్, ఇస్పాహన్ కేంద్రాలపై జరిగిన దాడులు విఫలమైనట్లు పెంటగాన్ ఇంటెలిజెన్స్ రిపోర్టులో వెల్లడైంది. ఇరాన్ అణు కేంద్రాల్లో ఉన్న సెంట్రిఫ్యూజ్‌లకు ఎటువంటి నష్టం జరగలేదని ఆ నివేదికలో పేర్కొన్నారు. కేవలం భూమి మీదున్న కట్టడాలు మాత్రమే స్వల్పంగా ధ్వంసమైనట్లు తెలిపారు. అణు కేంద్రాల వద్ద ఉన్న ఎంట్రెన్స్‌లు, కొన్ని బిల్డింగ్‌లు ధ్వంసమైనా, అండర్‌గ్రౌండ్‌లో మాత్రం ఎటువంటి నష్టం జరగలేదన్న రిపోర్టులో వెల్లడించారు.
