అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈసారి కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నది. సర్వేలు కూడా ఈసారి విజేత ఎవరనేది అంచనా వేయలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఎన్నికల్లో కమల, ట్రంప్‌కు సమాన ఓట్లు వస్తే ఎలా అనే ప్రశ్న తలెత్తుతున్నది. అమెరికాలోని 50 రాష్ర్టాలకు కలిపి 538 ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి. ప్రజలు వేసే ఓట్లలో మెజారిటీ ఓట్లు దక్కించుకున్న అభ్యర్థి ఖాతాలోకి ఆ రాష్ట్రం లోని ఎలక్టోరల్ ఓట్లన్నీ పడతాయి. ఇలా మొత్తంగా 270 ఓట్లు సాధించిన అభ్యర్థి విజేత అవుతారు. అయితే, ఇద్దరికీ 269-269 ఓట్లు వస్తే అనిశ్చితి నెలకొంటుంది. ఇప్పటివరకు ఇలాంటి పరిస్థితి తలెత్తలేదు.
అభ్యర్థులకు సమాన ఓట్లు వచ్చిన, ఎవరికీ 270 ఓట్లు రాకపోతే అధ్యక్ష ఎన్నిక ఎలా జరగాలనేది అమెరికా రాజ్యాంగంలోని రెండో అధికరణంలో పొందుపరిచారు. ఈ పరిస్థితి తలెత్తితే అధ్యక్షుడిని కొత్తగా ఎన్నికైన సభ్యులతో కూడిన హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్(ప్రతినిధుల సభ) ఎన్నుకుంటుంది. ఒక్కో రాష్ట్ర ప్రతినిధి బృందానికి ఒక్కో ఓటు ఉంటుంది. ఈ ఓట్లు ఎక్కువగా పొందిన అభ్యర్థికి అధ్యక్ష పదవి దక్కుతుంది. అంటే, మొత్తం 50 రాష్ర్టాల్లో ఎక్కువ రాష్ర్టాలను గెలుచుకున్న అభ్యర్థి విజేత అవుతారు. ఇదే విధంగా ఉపాధ్యక్షుడి ని సెనేట్ ఎన్నుకుంటుంది.