పద్మశ్రీ అవార్డు గ్రహిత, కిమ్స్` ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ పీ రఘురామ్ అరుదైన ఘనత సాధించారు. అసోసియేషన్ ఆఫ్ ది సర్జన్స్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ ఐర్లాండ్ (ఏఎస్‌జీబీఐ) గౌరవ ఫెలోషిప్‌ను అందుకున్నారు. వర్చువల్‌గా నిర్వహించిన ఏఎస్‌జీబీఐ 100వ వార్షిక జనరల్ బాడీ మీటింగ్‌లో ఆ సంస్థ అధ్యక్షుడు నీల్ వెల్చ్ డాక్టర్ రఘురామ్‌కు గౌరవ ఫెలోషిప్ ప్రకటించారు. గడిచిన వందేండ్లలో ఈ ఫెలోషిప్‌ను అందుకున్న తొలి భారతీయుడు రఘురామ్ కావడం గమనార్హం.
ఈ సందర్భంగా నీల్ వెల్ఛ్ మాట్లాడుతూ ఈ గౌరవం అందుకున్న భారతదేశ మొదటి సర్జన్ రఘురామ్ అని కొనియాడారు. ఆయనకు ఫెలోషిప్ అందజేస్తున్నందుకు ఆనందంగా ఉన్నదని పేర్కొన్నారు. ఫెలోషిప్ అందుకున్న సందర్భంగా డాక్టర్ రఘురామ్ మాట్లాడుతూ ఇది భారతదేశానికి లభించిన గొప్ప గౌరవమని చెప్పారు. దేశవ్యాప్తంగా శస్త్రచికిత్స కళ, విజ్ఞానాన్ని ప్రోత్సహిస్తున్నవారికి, తాను చికిత్స అందించిన రోగులకు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ రఘురామ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా శస్త్రచికిత్సల ద్వారా సేవలందించే కొందరికే అత్యున్నత గౌరవంగా ఏఎస్‌జీబీఐ ఫెలోషిప్ అందజేస్తారు.