78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఊరు-వాడా అన్ని చోట్లా జాతీయ పతాక ఆవిష్కరణ జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలో దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద జెండా వందన కార్యక్రమం జరిగింది. జాతీయ పతావిష్కరణ అనంతరం వరుసగా 11వ సారి ఎర్రకోట వేదికగా మాట్లాడిన ప్రధాని మోదీ రికార్డు సృష్టించారు. ఏకంగా 98 నిమిషాల పాటు మాట్లాడి అత్యధిక సమయం స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేసిన ప్రధానిగా నరేంద్ర మోదీ నిలిచారు. ఇవాళ సుధీర్ఘ ప్రసంగం చేయడంతో ఈ రికార్డు సొంతమైంది. దేశంలో నెలకొన్న అనేక సమస్యలను ప్రస్తావిస్తూ మోదీ ప్రసంగించారు. దీంతో ఆయన పేరిటే ఉన్న మునుపటి 94 రికార్డును ఆయన బద్దలు కొట్టారు.
ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి సుమారు 6,000 మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. ఈ ఏడాది ఎర్రకోటలో జరిగే వేడుకలను చూసేందుకు యువకులు, గిరిజనులు, రైతులు, మహిళా వర్గాలతో పాటు ఇతర ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. అంతేకాదు వివిధ రంగాలకు చెందిన, వివిధ రంగాలలో రాణించిన వారిని వేడుకలకు ఆహ్వానించారు.