దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. దేశంలో బీజేపీ హవా మరోసారి స్పష్టంగా కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానంలో ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి విజయం సాధించారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ వారణాసి లోక్‌సభ స్థానం నుంచే గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ప్రధాని 1,52,513 ఓట్ల మెజారిటీతో విజయాన్ని అందుకున్నారు. వారణాసి నియోజకవర్గంలోని మొత్తం 11,27,081 ఓట్లకుగాను మోదీకి 6,12,970 ఓట్లు పోలయ్యాయి.
గత రెండు ఎన్నికల్లో మోడీ మెజారిటీ బాగా తగ్గిపోయింది. అతను 2019 ఎన్నికలలో 479,505 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచాడు. అతను 2014 సాధారణ ఎన్నికల్లో 371,784 ఓట్ల తేడాతో గెలుపొందాడు. అయితే ఈసారి ఉత్తరప్రదేశ్లో చేదు ఫలితాన్ని బీజేపీ అంగీకరించాల్సి వచ్చింది. గత ఎన్నికల్లో 62 సీట్లు గెలుచుకున్న కమలం పార్టీ ఈసారి 33 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ మెజారిటీ కూడా తగ్గిపోయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.