అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన రచయిత, విశ్వహిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ షాంఘైలో అక్టోబర్ 24-25, 2026 తేదీలలో జరగనున్న 10వ అంతర్జాతీయ తెలుగు సదస్సుకు ఆత్మీయ అతిథిగా హాజరుకావడానికి ప్రయాణిస్తున్న సందర్భంగా హాంగ్ కాంగ్ ను సందర్శించారు.

హాంగ్ కాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటి, శ్రీ రవి పీసపాటి, క్రీడా కార్యదర్శి శ్రీ హరిన్ చక్రవర్తి, ప్రముఖ శాస్త్రీయ నృత్యకారుడు శ్రీ సంజయ్ వడపల్లి కలిసి వారికి హృదయపూర్వక స్వాగతం పలికారు.

ప్రవాస భారతీయులతో ఆత్మీయ సాహిత్య సమ్మేళనం
డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తో ప్రత్యక్షంగా మమేకమయ్యే అవకాశాన్ని కల్పించేందుకు ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ప్రత్యేకంగా “ఆత్మీయ సమ్మేళనం”ను నిర్వహించింది. తెలుగు, హిందీ భాషల్లో విశేష సాహిత్య సేవలందించిన ఈ మహనీయునితో సంభాషించే అవకాశాన్ని స్థానిక భారతీయులు, సాహిత్యాభిమానులు ఆసక్తిగా సద్వినియోగం చేసుకున్నారు.

తెలుగు, హిందీ భాషల్లో సమాన ప్రావీణ్యంతో అద్భుతమైన వాక్పటిమ కనబరిచిన డా. లక్ష్మీప్రసాద్ తమ రచనా ప్రస్థానం, అనువాద అనుభవాలు, సాహిత్య ప్రయాణంలోని విశేషాలను హాస్యరసంతో మేళవించి పంచుకున్నారు. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి కుటుంబ నేపథ్యం కంటే కృషి, ప్రతిభ, పట్టుదల ముఖ్యమని యువతకు ప్రేరణాత్మక సందేశం అందించారు.
జ్ఞాపకాల పుటల నుంచి విశిష్ట అనుభవాలు:
మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, నటుడు-రాజకీయ నాయకుడు ఎన్.టి. రామారావు, ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, కవి హరివంశ్రాయ్ బచ్చన్ తదితర మహనీయులతో తనకు కలిగిన అనుభవాలను ఆయన ఆసక్తికరంగా వివరించారు.

అనంతరం భాషా వైవిధ్యం, జాతుల మధ్య భాషా సంబంధాలు, సామాజిక సంభాషణల్లో భాష పాత్ర, తన రచనల్లోని పాత్రల రూపకల్పన వంటి అంశాలపై ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు ఆయన లోతైన విశ్లేషణతో సమాధానాలిచ్చి సభను జ్ఞానసభగా మలిచారు.
కార్యక్రమం చివరలో ఈ ఏడాది అత్యుత్తమంగా నిర్వహించిన మూడు బతుకమ్మలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల సాంప్రదాయ వంటకాలతో ఏర్పాటు చేసిన విందు పాల్గొన్న వారందరికీ ఆత్మీయ సాంస్కృతిక అనుభూతిని అందించింది.

విజయదశమి సందర్భంగా ఘన సన్మానం
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని హాంగ్ కాంగ్ లోని చారిత్రాత్మక హిందూ దేవాలయంలో డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి ఘన సత్కారం నిర్వహించారు. హ్యాపీ వ్యాలీలో ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక దేవాలయంలో హిందూ అసోసియేషన్ అధ్యక్షులు, ట్రస్టీ శ్రీ లాల్ హర్దసానీ ఆయనను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు, ట్రస్టీ మరియు కమిటీ సభ్యులు శ్రీ కృపలానీ భగ్వాన్దాస్ , ట్రస్టీ శ్రీ విశాల్ ఖురానా సహా పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. లక్ష్మీప్రసాద్ దేవాలయ గ్రంథాలయానికి తన రచనలతో కూడిన కొన్ని పుస్తకాలను బహుమతిగా అందజేశారు.
భక్తి, సంస్కృతి, ఉత్సవాల సమ్మేళనం:
సాయంత్రం నిర్వహించిన విజయదశమి వేడుకలు భక్తి గీతాలు, రామలీలా నృత్య ప్రదర్శనలు, రావణ దహన కార్యక్రమాలతో ఆధ్యాత్మిక–సాంస్కృతిక వైభవాన్ని సంతరించుకున్నాయి. రావణ దహన వేడుకలకు డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అధ్యక్షత వహించారు.

ప్రవాస భారతీయులతో కలిసి విజయదశమి ఉత్సవాల్లో పాల్గొనడం తాను ఎంతో ఆనందంగా, ఆత్మీయంగా భావించానని ఆయన పేర్కొన్నారు. ఈ ఉత్సవాలు భారతీయ సంస్కృతి, భక్తి, సామాజిక ఐక్యతకు ప్రతీకలుగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు.
డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ హాంగ్ కాంగ్ మరియు మకావ భారత కాన్సుల్ జనరల్ గౌరవనీయులు శ్రీ రాజేష్ ఎన్. నాయక్ ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సమావేశంలో ఇరువురి మధ్య పరస్పర గౌరవం, వృత్తిపరమైన సౌజన్యం, అలాగే నిర్మాణాత్మక ఆలోచనల మార్పిడి ప్రతిఫలించాయి. ముఖ్యంగా హిందీ భాషా ప్రాచుర్యం, అభివృద్ధి, అలాగే ప్రతీ ఏడాది నిర్వహించే హిందీ పఖ్వాడా దివస్ వంటి కార్యక్రమాల ప్రాధాన్యత మరియు ప్రోత్సాహంపై విలువైన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ భేటీ భారతీయ భాషా, సాంస్కృతిక విలువల పరిరక్షణకు మరియు విదేశాల్లో హిందీ ప్రచారానికి మరింత బలమైన సహకారానికి దోహదపడే దిశగా సానుకూల అడుగుగా నిలిచింది.
మరపురాని అధ్యాయంగా యార్లగడ్డ సందర్శన:
డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హాంగ్ కాంగ్ పర్యటన ప్రవాస తెలుగు సమాజంలో మాతృభాష, సాహిత్యం, సంస్కృతి పట్ల ఉన్న అభిమానాన్ని మరింత బలోపేతం చేసింది. సాహిత్య చర్చలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విజయదశమి ఉత్సవాలతో సుసంపన్నమైన ఈ పర్యటన హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య చరిత్రలో చిరస్మరణీయమైన అధ్యాయంగా నిలిచిపోతుందని సమాఖ్య సభ్యులు అభిప్రాయపడ్డారు.















