అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రభుత్వ సలహాదారు, డోజ్ అధిపతి ఎలాన్ మస్క్ విధానాలకు వ్యతిరేకంగా అమెరికన్లు గర్జించారు. హ్యాండ్సాఫ్ పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగారు. దేశంలోని 50 రాష్ర్టాల్లో దాదాపు 1400 చోట్ల భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దాదాపు మూడు నెలల కిందట అమెరికా అధ్యక్షుడిగా మరోసారి బాధ్యతలు స్వీకరించిన ట్రంప్, స్వల్ప సమయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు. ప్రభుత్వ ఉద్యోగులకు కోత పెట్టారు. ప్రపంచ దేశాలతో వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. ఈ క్రమంలో ట్రంప్ దుందుడుకు నిర్ణయాలను నిరసిస్తూ ప్రజలు ఆందోళనకు దిగారు. 2017లో మహిళల నిరసన, 2020లో బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్ ఆందోళనల తర్వాత ఇంత పెద్దయెత్తున నిరసనలు జరగడం ఇదే తొలిసారి.

దేశవ్యాప్తంగా స్టేట్ క్యాపిటల్స్, ఫెడరల్ బిల్డింగ్స్, కాంగ్రెసెనల్ ఆఫీసులు, సోషల్ సెక్యూరిటీ హెడ్‌క్వార్టర్లు, పార్కులు తదితర చోట్ల ప్రజలు ఆందోళన చేపట్టారు. బిలియనీర్ల పెత్తనానికి చెక్ పెట్టాలని, ప్రభుత్వంలో అవినీతికి ముగింపు పలకాలని, మెడిక్‌ఎయిడ్, సామాజిక భద్రత పథకాలకు నిధుల కోతను ఆపాలని, వలసదారులు, ట్రాన్స్‌జెండర్లు, ఇతర కమ్యూనిటీలపై దాడులను ఆపాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అలాగే ట్రంప్ టారిఫ్ వార్‌పైనా వారు మండిపడ్డారు. పెంగ్విన్లపై కాదు, సంపన్నులపై పన్నులు వేయండి అంటూ ఎద్దేవా చేశారు.
