ప్రముఖ విప్లవ కవి, ప్రజాగాయకుడు గద్దర్ కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని గద్దర్ కుమారుడు సూర్యం అధికారికంగా వెల్లడించారు. రెండు రోజులక్రితమే ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని వైద్యులు ప్రకటించారు. అంతలోనే ఈ విషాదవార్త వినాల్సి వచ్చింది. కాగా గద్దర్ అసలు పేరు విఠల్ రావు. అందరికీ గద్దర్‌గా సుపరిచితులైన ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో గద్దర్ దళిత కుటుంబంలో ఆయన జన్మించారు. తల్లి పేరు లచ్చమ్మ, తండ్రిపేరు శేషయ్య. నిజామాబాదు జిల్లా మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లో విద్యభ్యాసం పూర్తి చేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమ సమయంలో ఊరురా తిరిగి ప్రచారం చేశారు. ఇందుకోసం ఆయన బుర్రకథను ఎంచుకున్నారు. ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి.నరసింగరావు భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శనకు అవకాశమిచ్చారు. ఆ తర్వాత ప్రతి ఆదివారం ఆయన తన ప్రదర్శనలు ఇచ్చేవారు. 1971లో బి.నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట ఆపర రిక్షా పాట రాశారు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది.
గద్దర్ రాసిన పాటల్లో అమ్మ తెలంగాణమా అనే పాట పెద్దఎత్తున ప్రజాదరణ పొందింది. నీ పాదం మీద పుట్టు మచ్చ నై చెల్లెమ్మ పాటకు ఉత్తమ గీతంగా నంది అవార్డు కూడా దక్కింది. అయితే ఆయన ఆ అవార్డ్‌ను తిరస్కరించారు. జై బోలో తెలంగాణా సినిమాలో తెరపై కూడా ఆయన కనిపించారు. పొడుస్తున్న పొద్దూ మీద పాట ఆయనే రాసి పాడి, అభినయించారు. ఈ పాట తెలంగాణ ఉద్యమంలో ఎంతటి ప్రాచుర్యం పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎంపిక చేయడం విశేషం. గద్దర్ మరణంలో ఆయన అభిమానులు శోకసముద్రంలో మునిగిపోయారు. రాజకీయ, సినీ, ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు.