అరెస్ట్ భయంతో గత కొన్ని రోజులుగా దేశ సరిహద్దులు దాటని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పుడు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. ఈ ఏడాది మార్చిలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పుతిన్‌పై అరెస్ట్ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన విదేశీ పర్యటనలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అన్ని సదస్సుల్లోనూ వర్చువల్‌గా ప్లా్ల్గొంటున్నారు. అయితే, అరెస్ట్ వారెంట్ తర్వాత అక్టోబర్‌లో చైనాలో తన తొలి విదేశీ పర్యటను ముగించుకున్న పుతిన్ తాజాగా అరబ్ దేశాల పర్యటనకు సిద్ధమయ్యారు.
సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను పుతిన్ సందర్శించనున్నట్లు క్రెమ్లిన్ ప్రకటించింది. అధ్యక్షుడు పుతిన్ రేపు యూఏఈ, సౌదీ అరేబియా పర్యటనకు వెళ్తున్నారు అని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలు, ఇజ్రాయెల్ – హమాస్ మధ్య వివాదం, అంతర్జాతీయ రాజకీయాలపై రష్యా అధినేత చర్చిస్తారని ఆయన చెప్పారు.