రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైతం రష్యా జనాభాను పెంచేందుకు ఓ పథకం తీసుకొచ్చారు. 10 అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనే మహిళలకు నజరానా ప్రకటించారు. ఈ మేరకు మదర్ హీరోయిన్ అవార్డును గత వారం ప్రకటించినట్లు తెలిసింది. పది మంది అంతకంటే ఎక్కువ పిల్లలను కనే మహిళలకు మిలియన్ రూబెన్స్ (భారత కరెన్సీలో దాదాపు రూ.13 లక్షలకుపైన) నజరానా ఇస్తామని పుతిన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించనున్నట్లు తెలిపింది. అయితే దీనికో మెలిక కూడా పెట్టింది. 10వ బిడ్డ మొదటి పుట్టిన రోజు నాడు ఈ నగదు చెల్లిస్తారట. అప్పటికి మిగతా 9 మంది పిల్లలు జీవించి ఉండాలని షరతు పెట్టారు. ఈ అవార్డుకు సంబంధించి రష్యా మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ అవార్డును 1944లో అప్పటి సోవియట్ ప్రీవియర్ జోసెఫ్ స్టాలిన్ ప్రవేశపెట్టారు. యూఎస్‌ఎస్‌ఆర్ గౌరవ పురస్కారం పేర్కొంటూ దాదాపు 4 లక్షల మంది పౌరులకు ఈ అవార్డును అందజేశారు. ఇప్పుడు రష్యా జనాభా పెంచడం కోసం పుతిన్ ఈ అవార్డును మళ్లీ వెలుగులోకి తీసుకురావడం గమనార్హం.