ఈ నెల 22న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఆస్ట్రేలియా సిడ్నీలోని ఓంబుష్ పార్క్లో ఆవిష్కరించనున్నారు. అనంతరం స్ట్రాత్ఫీల్డ్ టౌన్ హాలులో పెద్ద ఎత్తున సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లను పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు మహేశ్ బిగాల పరిశీలించారు. ఈ సందర్భంగా మహేశ్ బిగాల మాట్లాడుతూ ఆస్ట్రేలియాలో పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించనుండడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు. భారత్ నుంచి పీవీ శతజయంతి ఉత్సవాల చైర్మన్, ఎంపీ కే కేశవరావు, ఎమ్మెల్సీ సురభి వాణీదేవితో పాటు కుటుంబ సభ్యులు హాజరవుతారన్నారు.
తెలంగాణకు చెందిన సంధ్యారెడ్డి తొలిసారిగా స్వతంత్ర అభ్యర్థిగా కౌన్సిలర్గా పోటీ చేసి గెలుపొందారన్నారు. లోకల్ మేయర్, అధికారులు, సంధ్యారెడ్డి విగ్రహ ఏర్పాటుకు అన్నివిధాలా సహకరించారన్నారు. తక్కువ సమయంలో విగ్రహ ఏర్పాటుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. విగ్రహావిష్కరణ మహోత్సవానికి మెల్బోర్న్, బ్రిస్బేన్, పెర్త్, అడిలైడ్ తదితర రాష్ట్రాల నుంచి పాల్గొంటారన్నారు. స్ట్రాత్ఫీల్డ్ కౌన్సిలర్ సంధ్యారెడ్డి , కెర్రీ రెడ్డితో వెంకట్ రమణ, కిశోరె బేండే, యతీన్ గుప్తా , రాజేశ్ రాపోలు, అరవింద్ రెడ్డి, ముస్తఫాతో పాటు పలువురు సభ్యులతో కలిసి విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లను పర్యవేక్షించారు.