కజకిస్థాన్‌లో ఇంధన ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. అధ్యక్షుడు కాసిమ్ జోమార్ట్ తొకయేవ్కు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. దేశంలోనే అతిపెద్ద నగరమైన అల్మాటీతో పాటు ప్రధాన నగరాల్లో ఆందోళనకారులు నిరసనలను ఉద్ధృతం చేశారు. మేయర్ ఆఫీస్ సహా పలు కార్యాలయాలకు నిప్పు పెట్టారు. ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేశారు. దీంతో ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరుపడంతో 12 మంది మృతి చెందారు. వేలాదిమందికి గాయాలయ్యాయి. నిరసనకారుల దాడుల్లో 350 మందికి పైగా తీవ్ర గాయాలైనట్టు అధికారులు తెలిపారు. నిరసనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని విధించారు. ఇంటర్నెట్ సేవలను రద్దు చేశారు. దేశంలో పరిస్థితులను అదపు చేయడానికి శాంతి పరిరక్షణ దళాలను పంపించాల్సిందిగా రష్యా నేతృత్వంలోని కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్‌కు అధ్యక్షుడు కసైమ్ జోమార్ట్ టొకాయెవ్ విజ్ఞప్తి చేశారు. కజికిస్థాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులు స్వదేశానికి రావాలనుకొంటే ఏర్పాట్లు చేస్తామని విదేశాంగ శాఖ తెలిపింది. దేశంలో పరిస్థితులపై రష్యా, చైనాతో పాటు ఐక్యరాజ్యసమితి, అమెరికా ఆందోళన వ్యక్తం చేశాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. సామూహిక సమావేశాలను రద్దు చేశారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)