కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 13 లేదా 14 తేదీల్లో ఆయన హైదరాబాద్‌కు రానున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో మహేష్ కుమార్ గౌడ్ దాదాపు అరగంట పాటు సమావేశమయ్యారు. ఈ భేటీలో రాహుల్ పర్యటనతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు.

హైదరాబాద్ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ గిగ్ వర్కర్లతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం గిగ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం తెచ్చిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో రాహుల్ ‘భారత్ సమ్మిట్’ కార్యక్రమంలోనూ పాల్గొంటారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ సమ్మిట్ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొంటారని సమాచారం.

మరోవైపు.. దేశవ్యాప్తంగా ఓబీసీల ప్రాతినిధ్యం, వారి హక్కులపై ఈ భేటీలో చర్చ జరిగింది. కుల గణనకు మద్దతుగా హైదరాబాద్‌లో జరిగే సభతో పాటు, ‘మెగా బీసీ ర్యాలీ’కి రావాల్సిందిగా రాహుల్‌ను మహేశ్ కుమార్ గౌడ్ ఆహ్వానించారు. దీనికి సంబంధించిన తేదీలు త్వరలో ఖరారు కానున్నాయి.

ఈ భేటీలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, పార్టీ చేపడుతున్న కార్యక్రమాలపై రాహుల్‌కు నివేదిక సమర్పించినట్లు పీసీసీ చీఫ్ తెలిపారు. అలాగే నవంబర్ నెలాఖరు నాటికి రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తిగా పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సోనియా గాంధీ ఆత్మకథ రానుండటాన్ని స్వాగతిస్తూ తెలంగాణలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. మొత్తానికి రాహుల్ గాంధీ రానున్న పర్యటన తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త జోష్ నింపనుంది.















