చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ల బిల్లుకు రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే 128వ రాజ్యాంగ సవరణ బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. నారీ శక్తి వందన్ అధినియమ్ పేరిట తీసుకొచ్చిన బిల్లును కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై చర్చ ప్రారంభమైంది. సుమారు 11 గంటల పాటు బిల్లుపై చర్చ జరిగింది. మాన్యువల్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. పార్టీలకతీతంగా సభ్యులందరూ ఈ బిల్లుకు మద్దతుగా నిలిచారు. మొత్తం 215 మంది సభ్యులు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా, బిల్లును ఒక్కరూ కూడా వ్యతిరేకించకపోవడం విశేషం. ఈ మేరకు ఓటింగ్ అనంతరం బిల్లును రాజ్యసభ ఆమోదించినట్టు రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ ప్రకటించారు. ఉభయ సభల్లోనూ ఆమోదం పొందిన ఈ బిల్లు జనగణన, డీలిమిటేషన్ ప్రక్రియ అనంతరం కార్యరూపం దాల్చే అవకాశంఉంది.
పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ప్రతిసభ్యుడికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ బిల్లుపై రాజ్యసభలో చేపట్టిన చర్చలో ఉభయ సభల నుంచి వివిధ పార్టీలకు చెందిన 132 మంది సభ్యులు భాగస్వాములయ్యారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ చర్చలోని ప్రతి పదం రాబోయే ప్రయాణంలో మనందరికీ ఉపయోగపడుతుందని.. ప్రతి విషయానికి దాని సొంత ప్రాముఖ్యత, విలువ ఉంటాయని తెలిపారు.