ప్రపంచంలోనే నియంతగా పేరు తెచ్చుకున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు ఏది చేసినా అదొక వింతే అవుతుంది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, భార్య రి సోల్ జు చాలా అరుదుగా బయట కనిపిస్తారు. సుమారు ఐదు నెలల తర్వాత ఆమె మరోసారి అందరి కంటపడ్డారు. లూనార్ న్యూ ఇయర్ సందర్భంగా రాజధాని ప్యాంగ్యాంగ్‌లోని మన్సుడే ఆర్ట్ థియేటర్‌లో జరిగిన ఒక కళా ప్రదర్శనకు కిమ్ జోంగ్ ఉన్ తన భార్య, అత్తతో కలిసి హాజరయ్యారు. థియేటర్ ఆడిటోరియంలో కిమ్ దంపతులు ఎంట్రీ ఇవ్వగానే వారికి ఘన స్వాగతం పలికారు. కిమ్‌తో పాటు ఆయన భార్య రి సోల్ జును చూసిన ప్రేక్షకులు హుర్రే హుర్రే అంటూ హోరెత్తించారు. ఆమె సంప్రదాయ ఎరువు, నలుపు రంగు హాన్ బాక్ దుస్తులు ధరించారు. షో సమయంలో కిమ్‌తో మాట్లాడుతూ నవ్వుతూ కనిపించారు. కిమ్ దంపతులు షోలో కళాకారులకు షేక్‌హ్యాండ్ ఇవ్వడంతో పాటు వారితో కలిసి ఫోటోలు దిగారు.
కిమ్ సతీమణి రి సోల్ జు చివరిసారిగా సెప్టెంబర్ 9న బహిరంగంగా కనిపించారు. ఆ దేశ వ్యవస్థాపక వార్షికోత్సవం సందర్భంగా దివంగత తాత, తండ్రి ఎంబాల్డ్ మృతదేహాలను ఉంచే కుమ్సుసన్ ప్యాలెస్ ఆఫ్ ది సన్‌ని సందర్శించడానికి భర్త కిమ్‌తో కలిసి ఆమె వెళ్లారు.














