అమెరికాలో నిర్వహించే ప్రతిష్ఠాత్మక స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో తొలిసారి ఆప్రికన్ అమెరికన్ విద్యార్థి విజేతగా నిలిచారు. లూసియానాకు చెందిన జైలా అవంత్ గార్డె (14)గా ఏడాది చాంపియన్‌గా అవతరించారు. దీంతో గత 93 ఏండ్లుగా జరుగుతున్న ఈ పోటీల్లో గెలిచిన రెండో నల్లజాతీయురాలుగా జైలా ఘనత సాధించారు. 93సార్లు జరిగిన ఈ స్పెల్లింగ్ బీ పోటీల చరిత్రలో ఒక ఆఫ్రికన్ అమెరికన్ ట్రోఫీ నెగ్గడం ఇదే తొలిసారి. ఈ ఏడాది 11 మంది ఫైనల్‌కు చేరగా అందులో 9 మంది భారత సంతతి విద్యార్థులే. ఈ పోటీల్లో తెలుగు మూలాలున్న చైత్ర తుమ్మల (శాన్ ప్రాన్సిస్కో)కు రెండో స్థానం లభించింది. చైత్ర తల్లిదండ్రులు మురళీమోహన్, శ్రీదివ్య చిత్తూరు నుంచి అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. మూడో స్థానం కూడా భారత సంతతికి చెందిన 13 ఏళ్ల భావన మదీనికి దక్కడం విశేషం.
ఈ కార్యక్రమానికి హాజరైన అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ విజేతలను అభినందించారు. స్పెల్లింగ్ బీ ఛాంపియన్‌గా నిలిచిన వారికి 50 వేల అమెరికన్ డాలర్లను బహుమతిగా ఇస్తారు. కాగా బాస్కెట్ బాల్ క్రీడాకారిణి అయిన జైలా పేరిట మూడు గిన్నిస్ బుక్ రికార్డులు కూడా ఉన్నాయి. ఏకకాలంలో ఒకటి కన్నా ఎక్కువ బంతులతో బాస్కెట్‌బాల్ ఆడి ఆమె రికార్డు సృష్టించారు.