Skip to main content

Namaste NRI

హరీశ్ రావు అడ్డాలో రేవంత్ రెడ్డి భారీ స్కెచ్!

మాజీ మంత్రి హరీశ్ రావు కంచుకోటైన సిద్దిపేటలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుపెట్టనున్నారు. గత నెలలో కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో పర్యటించిన సీఎం.. ఇప్పుడు హరీశ్ రావు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. పేద కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక భరోసా కల్పించే ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచే లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఇందిరా చౌరస్తా నుంచి నాగదేవత కూడలిలోని సభా ప్రాంగణం వరకు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం 2.2 కిలోమీటర్ల మేర భారీ పాదయాత్ర చేపట్టనున్నారు.

కేవలం బీమా పథకం ప్రారంభోత్సవమే కాకుండా, సిద్దిపేట జిల్లా అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా రూ.544.11 కోట్ల నిధుల వర్షం కురిపించనున్నారు. ఇందులో రూ.451.13 కోట్లతో కొత్త పనులకు శంకుస్థాపనలు, రూ.92.98 కోట్లతో పూర్తయిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ముఖ్యంగా విద్యారంగానికి పెద్దపీట వేస్తూ దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లో రూ.200 కోట్ల చొప్పున వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలకు సీఎం భూమిపూజ చేస్తారు. వీటితో పాటు 7 ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, 6 తహసీల్దార్ కార్యాలయాలు, చిన్నకోడూరు, దౌల్తాబాద్ మండలాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, జనగామ నియోజకవర్గంలో 3 విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు.

ఇప్పటికే పూర్తయిన కీలక ప్రాజెక్టులను కూడా ముఖ్యమంత్రి ప్రజలకు అంకితం చేయనున్నారు. జిల్లాలో రూ.54.67 కోట్లతో నిర్మించిన 14 విద్యుత్ సబ్ స్టేషన్లు, కొమురవెల్లి మల్లన్న ఆలయ భక్తుల కోసం రూ.14.35 కోట్లతో నిర్మించిన వసతి సత్రం, రూ.12 కోట్ల క్యూ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారు. అలాగే రూ.6.50 కోట్లతో నిర్మించిన 53 గ్రామ మహిళా సంఘాల భవనాలు, రాయపోల్ మండలంలో రూ.3.87 కోట్ల కేజీబీవీ భవనం, గజ్వేల్‌లో రూ.1.59 కోట్ల విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. సిద్దిపేటతో పాటు మెదక్, సంగారెడ్డి, జనగామ, కరీంనగర్ జిల్లాల నుంచి స్వశక్తి సంఘాల మహిళలు, లబ్ధిదారులు భారీగా తరలివచ్చేలా మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి ఏర్పాట్లను పర్యవేక్షించారు. గులాబీ కోటలో కాంగ్రెస్ జెండాను మరింత బలోపేతం చేసే దిశగా రేవంత్ రెడ్డి పర్యటన సాగనుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events