వంట విషయంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తన సతీమణి అక్షతామూర్తి నుంచి మంచి మార్కులు కొట్టేశారు. ఆయన చక్కగా వంట చేస్తారని ఆమె కితాబిచ్చారు. తనకూ పాకశాస్త్రమంటే ఆసక్తేనని తెలిపారు. అయితే, ఈ విషయంలో రిషికే ఎక్కువ నైపుణ్యం ఉందన్నారు. ప్రధానిగా బాధ్యతలు ఎక్కువైన కారణంగా ఇప్పుడు వంటగదిలో గడిపేందుకు ఎక్కువ సమయం దొరకడం లేదని సునాక్ తెలిపారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా వీరిద్దరూ మాట్లాడుతూ తమ దైనందిన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఇద్దరిలో రిషి ఓ క్రమపద్ధతిలో ఉంటారని, తరచూ బెడ్‌రూంలోకి వచ్చి బెడ్‌ను పొందిగ్గా సర్దుతుంటారని అక్షత తెలిపారు. తాను ఉదయాన్నే లేచే వ్యక్తిని కాదని చెప్పగా, బెడ్ సర్దడం కూడా నీకు ఇష్టం ఉండదు. అది కన్ను బాధిస్తుంది అని సునాక్ సరదాగా వ్యాఖ్యానించారు. ఇద్దరం స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు కూడా నేను మంచం మీదే భోజనం చేసి, ప్లేట్లు అక్కడే వదిలిపెట్టేదాన్ని. అది చూసి రిషి విసుక్కొనేవారు. ఆయనతో పోలిస్తే అంత క్రమద్ధతి గల వ్యక్తిని కాదు అని అక్ష చెప్పుకొచ్చారు.