కేథలిక్ చర్చ్ పోప్ ఫ్రాన్సిస్ వారసునిగా అమెరికన్ కార్డినల్ రాబర్ట్ ప్రివోస్ట్ ఎన్నికయ్యారు. ఆయనను ఇకపై లియో 14 అని పిలుస్తారు. 2,000 సంవత్సరాల చర్చి చరిత్రలో ఈ స్థానానికి చేరుకున్న తొలి అమెరికన్‌గా ఆయన చరిత్ర సృష్టించారు. కేథలిక్ చర్చ్‌కి 140 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. నూతన పోప్‌ను ఎన్నుకోవడం కోసం 133 మంది కార్డినల్స్ ఓట్లు వేశారు. ఈ ఎన్నికలో రాబర్ట్ విజేతగా నిలిచారు. దీనికి సంకేతంగా సిస్టిన్ చాపెల్ చిమ్నీ నుంచి తెల్లని పొగ వెలువడింది. ఈ ఎన్నికను ప్రకటించిన 70 నిమిషాల తర్వాత నూతన పోప్ లియో సెయింట్ పీటర్స్ బసిలికా సెంట్రల్ బాల్కనీలో విశ్వాసులకు దర్శనమిచ్చారు.

ఫ్రెంచ్ కార్డినల్ డొమినిక్ మంబెర్టి నూతన పోప్ ఎన్నికైనట్లు ప్రకటించారు. హబెముస్ పపమ్ (మనకు పోప్ వచ్చారు) అని చెప్పారు. సెయింట్ పీటర్స్ స్కేర్‌లో వేలాదిమంది ఈ ప్రకటనతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. పోప్ లియో (69) షికాగోకు చెందినవారు. ఆయన తన జీవితంలో అత్యధిక భాగం పెరూ మిషనరీలో పని చేశారు. 2023లో కార్డినల్ అయ్యారు. పోప్ ఫ్రాన్సిస్ గత నెలలో మరణించిన సంగతి తెలిసిందే.
