అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై వేసిన పరువు నష్టం కేసులో అమెరికా శృంగార తార స్టార్మీ డేనియల్స్‌కు చుక్కెదురైంది. ఆరోపణలు రుజువు చేయడంలో విఫలమైనందుకు ట్రంప్ న్యాయవాదులకు సుమారు ఒక కోటి రూపాయలు చెల్లించాలని 9వ యూఎస్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ మంగళవారం ఆదేశించింది. మరోవైపు తనపై దాఖలైన 34 నేరాభియోగాల్లో తాను దోషిని కాదని ట్రంప్ కోర్టుకు తెలిపారు. డేనియల్స్‌తో సంబంధం బయటపడకుండా ఉండేందుకు ఆమెతో అనైతిక ఒప్పందం చేసుకున్నారన్న ఆరోపణల కేసులో ట్రంప్ మంగళవారం మన్‌హటన్ కోర్టు విచారణకు హాజరయ్యారు. అంతకుముందు, లొంగిపోయేందుకు ట్రంప్ కోర్టు హాలుకు రాగా, పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. విచారణ అనంతరం ట్రంప్ కోర్టు నుంచి వెళ్లిపోయారు.

తన రాజకీయ భవితను దెబ్బతీసేందుకు ఈ కేసు పెట్టారని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ తరఫున కాలిఫోర్నియా కేసులో పరువునష్టం దావాలో థిల్లాన్ లా గ్రూప్‌నకు చెందిన న్యాయవాది హర్మీత్ థిల్లాన్ వాదించారు. కోర్టు తీర్పు తరువాత ఆమె తమ ట్విట్టర్‌లో తీర్పు ప్రతిని ఉంచారు. ప్రెసిడెంట్ ట్రంప్ చిట్టచివరికి ఈ న్యాయపరమైన పోరులో విజయం సాధించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఇప్పుడు కాలిఫోర్నియా కేసుకు, మాన్‌హట్టన్ కేసుకు ఎటువంటి సంబంధం లేదు. కానీ రెండు కూడా పోర్న్‌స్టార్ డేనియల్ కేంద్ర బిందువుగా దాఖలు అయినవే కావడం విశేషం . 2018లో ట్రంప్‌ను డేనియల్ కోర్టుకు లాగారు. అప్పుడు ఆ తరువాత కూడా డేనియల్స్‌కు రెండుసార్లు కోర్టు నుంచి బ్రేక్ పడింది. ఆమె ట్రంప్‌పై పెట్టిన కేసులు చెల్లనేరవని పేర్కొంటూ రెండుసార్లు జరిమానాలు విధించారు. అప్పుడు ఇప్పుడు పడ్డ సరికొత్త జరిమానా మొత్తాలతో కలిస్తే ట్రంప్ న్యాయవాదులకు ఈ శృంగార తార ఏకంగా 5 లక్షల డాలర్ల వరకూ చెల్లించుకున్నట్లు అవుతుంది. దీని విలువ రూ 5 కోట్లు దాటి ఉంటుంది.















