గోపీచంద్, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం రామబాణం. డింపుల్ హయతి కథానాయిక. శ్రీవాస్ దర్శకుడు. పీపుల్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. కుష్బూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా ఈ సినిమా కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో గోపీచంద్, జగపతిబాబు పంచెకట్టులో సంప్రదాయబద్దంగా కనిపిస్తున్నారు. ఆ రాముడికి లక్ష్మణుడు, హనుమంతుడు అని ఇద్దరు ఉంటారు. ఆ ఇద్దరిని కలిపితే నేను అనే సంభాషణతో రూపొందించిన వీడియో ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో జగపతిబాబు ప్రజా నాయకుడిగా కనిపిస్తాడని, ఆయనకు అండగా నిలిచే అనుచరుడిగా గోపీచంద్ శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రంలో సచిన్ ఖేడ్ ఖర్, నాజర్, ఆలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా తదితరులు నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్, సామాజిక సందేశంతో రూపొందిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కథ: భూపతి రాజా, కెమెరా: వెట్రి పళని స్వామి.