నల్ల సముద్రంలో తమ నౌకలపై ఉక్రెయిన్ చేసిన దాడులకు ప్రతీకారంగా రష్యా పెద్ద ఎత్తున విరుచుకుపడడంతో ఉక్రెయిన్‌లోని కీవ్, ఖర్కివ్ సహా అనేక నగరాలు దద్దరిల్లిపోయాయి. ప్రజలు తమ పనుల్లోకి వెళ్లబోతున్న సమయంంలో ఉదయాన్నే పెద్దపెద్ద పేలుళ్లు సంభవించాయి. క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉందంటూ అధికారులు సంక్షిప్తే సందేశాలు పంపడంతో పాటు మూడు గంటల సేపు సైరన్లు మోగించారు. దాడుల్లో ప్రధానంగా తాగునీరు, విద్యుత్తు సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఉక్రెయిన్‌కు సంఫీుభావంగా వస్తున్న చెక్ రిపబ్లిక్ ప్రధాని ఫైలా ఆయన మంత్రివర్గ సహచరులు కీవ్‌కు చేరుకొనేందుకు కొద్దిసేపటి ముందే ఈ దాడులు జరిగాయి. అత్యంత కచ్చితత్వంతో కూడిన దీర్ఘశ్రేణి ఆయుధాలతో ఉక్రెయిన్ సైనిక శిబిరాలపై, విద్యుత్తు వ్యవస్థ లపై దాడులు చేశామనీ, అనుకున్న లక్ష్యాలను సాధించామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
రాజధాని కీవ్‌లో 80 శాతం మందికి నీటి సరఫరా జరగడం లేదని ఆ నగర మేయర్ తెలిపారు. ఇప్పటికే ఉక్రెయిన్‌లోని అనేక ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా సమస్యలున్నాయి. ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల ఎగుమతులను మళ్లీ అడ్డుకుంటామని రష్యా బెదిరించిన నేపథ్యంలో 12 నౌకలు ఉక్రెయిన్ రేవుల నుంచి సరకుతో బయల్దేరాయి. తీవ్ర కరువుతో అల్లాడుతున్న ఇథియోపియాకు ఒక నౌక వెళ్లింది.